జనుపల్లిలో భక్తిశ్రద్ధలతో గోవర్ధనగిరి పూజ మహోత్సవం.. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు!

అమలాపురం ఇస్కాన్ ఆధ్వర్యంలో జనుపల్లిలో శ్రీ గోవర్ధనగిరి పూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని లీలలను స్మరిస్తూ హరినామ సంకీర్తన, కృష్ణకథ, గోపూజ, గోవర్ధనగిరి పూజ చేపట్టారు. పండ్లు, కూరగాయలు, అన్నంతో గోవర్ధనగిరిని రూపొందించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ మేనేజర్ శివానంద నిమాయి దాస్, పూజారి సత్య జగన్నాథ్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.