Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పుణ్యానికి పోతే పాపం ఎదురైంది! తుఫాను బాధితులకు ఆశ్రయమిస్తే.. పాఠశాలను ధ్వంసం చేసి, విలువైన సామాగ్రి చోరీ

Author
Posted By Newton
| 02 Nov 2026, 04:37 PM | 3 | వార్తలు

పుణ్యానికి పోతే పాపం ఎదురైంది!

తుఫాను బాధితులకు ఆశ్రయమిస్తే.. పాఠశాలను ధ్వంసం చేసి, విలువైన సామాగ్రి చోరీ

కాకినాడ:

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలన్న మానవతా దృక్పథంతో పాఠశాల తలుపులు తెరిచిన యాజమాన్యానికి చేదు అనుభవం ఎదురైంది. తుఫాను బాధితులకు ఆశ్రయం కల్పించి, విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్ సౌకర్యం సైతం ఏర్పాటు చేస్తే.. అదే పాఠశాలను కొందరు దుండగులు విధ్వంసం చేసి, విలువైన సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన కాకినాడ నగరంలో కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల సంభవించిన తుఫాను నేపథ్యంలో కాకినాడ డెయిరీ ఫామ్ సెంటర్ సమీపంలోని ఏఎంజీ స్కూల్‌ను పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేశారు. తుఫాను బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా జనరేటర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయితే, ఆశ్రయం పొందిన వారిలో కొందరు పాఠశాల ఆస్తులపై కన్నేసి విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాళాలు వేసి ఉన్న తరగతి గదులను పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు ఖరీదైన ప్రొజెక్టర్లు, సీసీ కెమెరాలతో పాటు విద్యార్థుల పుస్తకాలు, బ్యాగులు, పెన్నులను సైతం వదలకుండా ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా సైన్స్ ల్యాబ్‌లోని రసాయనాలు, ప్రయోగ పరికరాలు, నమూనాలు, అస్థిపంజరాన్ని ధ్వంసం చేశారు.

డ్రాయింగ్ ల్యాబ్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి రూపొందించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రముఖ శాస్త్రవేత్త సీవీ రామన్ తదితరుల థర్మోకోల్ ప్రతిమలను సైతం పగలగొట్టారు. సోషల్ ల్యాబ్‌లోని చార్టులను చించివేశారు. వాష్‌రూమ్ తలుపులు, ఆర్వో ప్లాంట్ డోర్లు, వాటర్ ట్యాంక్ మూతలను కూడా విరగ్గొట్టి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

విధ్వంసానికి సంబంధించిన ఆధారాలు లభించకుండా సీసీటీవీ కెమెరాల వైర్లను తెంచివేయడంతో పాటు పాఠశాల ప్రాంగణాన్ని అపరిశుభ్రంగా మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆపదలో ఉన్నవారికి ఆశ్రయం కల్పిస్తే.. ఆ ఆశ్రయాన్నే ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం? అంటూ పాఠశాల యాజమాన్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడాల్సిన పరికరాలు, విద్యా సామగ్రి ధ్వంసం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

పాఠశాల ఆస్తులకు జరిగిన నష్టాన్ని గుర్తించి, చోరీకి గురైన సామాగ్రిని తిరిగి అప్పగించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి